బాల్య వివాహాలు సమాజానికి శాపం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలు సమాజానికి శాపం

Feb 1 2026 6:32 AM | Updated on Feb 1 2026 6:32 AM

బాల్య వివాహాలు సమాజానికి శాపం

బాల్య వివాహాలు సమాజానికి శాపం

పోక్సో, బాల్య వివాహాల నిషేధ చట్టం అమలుకు సహకరించాలి

హై కోర్టు న్యాయమూర్తి సామ్‌ కోషి

కామారెడ్డి క్రైం: బాల్య వివాహాలు సమాజానికి శాపంగా మారాయని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్య నిర్వాహక చైర్మన్‌ జస్టిస్‌ పి సామ్‌ కోషి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ‘మహిళలు, పిల్లల రక్షణ–సామాజిక బాధ్యత’ అనే అంశంపై పంచాయతీ సెక్రెటరీలు, కమ్యూనిటీ పెద్దలు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జస్టిస్‌ పి సామ్‌ కోషి, గౌరవ అతిధిగా జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్‌ నర్సింగ్‌రావు నందికొండ హాజరయ్యారు. వారికి జిల్లా జడ్జి సీహెచ్‌వీఆర్‌ఆర్‌ వరప్రసాద్‌, ఎస్పీ రాజేశ్‌చంద్ర, అదనపు కలెక్టర్‌ విక్టర్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ పి.సామ్‌ కోషి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. బాల్య వివాహాల కారణంగా బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్‌ తీవ్రంగా దెబ్బతింటుందని అన్నారు. బాల్య వివాహాల సమాచారాన్ని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1098 కు గానీ, సంబంధిత అధికారులకు అందించాలని కోరారు. పోక్సో, బాల్య వివాహాల నిషేధ చట్టాల అమలులో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల సహకారం అత్యంత అవసరమన్నారు. అనంతరం పోక్సో, బాల్య వివాహాల నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల నుంచి రక్షించబడిన ముగ్గురు పిల్లలకు, ఆరుగురు కేజీబీవీ పాఠశాలల ప్రత్యేక అధికారులకు, ఐదుగురు బాన్సువాడ కమ్యూనిటీ మధ్యవర్తిత్వ వలంటీర్లు, సోషల్‌ మీడియా అవగాహన కార్యక్రమాల్లో కృషి చేసిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వృద్ధులకు 2 వీల్‌ చైర్లు, పీపుల్‌ ఫర్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ అనే ఎన్జీవో ద్వారా ఐదుగురు మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అనంతరం న్యాయ సేవా కార్యాలయంలో మదర్‌ ఫీడింగ్‌ క్యాబిన్‌ ప్రారంభించి, బార్‌ అసోసియేషన్‌ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి సుర సుమలత, జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీమతి ఎం. సుష్మ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నంద రమేష్‌, ఆర్డీవో వీణ, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement