ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
నిజామాబాద్ అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేస్తూ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని సీపీ సాయిచైతన్య అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిజామాబాద్ డివిజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేరాలను నియంత్రించాలన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. పోక్సో గ్రేవ్ కేసులలో త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ అంజయ్య, నిజామాబాద్ డివిజన్ సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.


