వేలం వేస్తే వేటే..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నికలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించనుంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు, నిధుల కోసం ఏకగ్రీవ ఎన్నికల పేరుతో పదవులను వేలం వేసే గ్రామాభివృద్ధి కమిటీలపై చర్యలు తీసుకోవడంతోపాటు ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులను కొనసాగించడానికి ఉన్నతాధికారులు ఆమోదం తెలిపే అవకాశం లేదు. పదవుల వేలం ద్వారా ప్రజాప్రతినిధులను ఎంపిక చేస్తే వేటు పడే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వేలం పాటలను నిర్వహించిన ఉమ్మడి మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాభివృద్ధి కమిటీలపై పోలీసు లు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏకగ్రీవాల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామాల్లో జనాభా ఆధారంగా సర్పంచ్ పదవికి వేలం పాటలో రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఉప సర్పంచ్ పదవికి రూ.2 లక్షల వరకు, వార్డు స్థానాలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వేలం పాట ద్వారా పదవులు అప్పగించారు. మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, మెండోరా, ముప్కాల్, బా ల్కొండ, వేల్పూర్, భీమ్‌గల్, జక్రాన్‌పల్లి, ఆర్మూర్, నందిపేట్ మండలాల్లో వేలం పాటల ద్వారా పదవులను అంగట్లో సరుకుల్లాగా అమ్ముకున్న ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వేలం పాట నిర్వహించే వీడీసీల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు నిఘా సారించారు. ఈసారి ఏకగ్రీవాలకు ప్రోత్సాహకం ప్రకటించకపోయినా రాజకీ య కక్షలను నివారించాలనే ఉద్దేశంతో ఏకగ్రీవాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఏకగ్రీవాలు జరిగిన గ్రామాలలో వాస్తవ పరిస్థితులను అధికారులు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుంది. అందరూ సమష్టి నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా ఎంపిక చేసిన ప్రజాప్రతినిధులను ఎన్నికల సంఘం ఆమోదించే అవకాశం ఉంది.
గ్రామంలో అభివృద్ధి పనులు, నిధుల కోసమంటూ సర్పంచ్, వార్డు పదవులను వీడీసీలు బలవంతంగా వేలం వేస్తే వేటు తప్పదని అధికారయంత్రాంగం హెచ్చరిస్తోంది. జిల్లాలోని పలు మండలాల్లో వేలం పాట ద్వారా పదవులను కట్టబెట్టిన ఘటనలు అనేకం ఉన్నాయి. కొన్ని వీడీసీలపై క్రిమినల్ కేసులు సైతం నమోదు కాగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఏకగ్రీవాలు జరిగిన గ్రామాల్లోని పరిస్థితులను అధికారులు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తరువాతే ఆమోదం లభిస్తుంది.
వేలం పాటలు చట్ట విరుద్ధం
వేలం పాటల ద్వారా సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం చట్ట విరుద్ధం. సమష్టిగా అందరూ యోగ్యులైన వారిని ఎంపిక చేస్తే ఎ లాంటి ఇబ్బంది లేదు. ఎక్కడైనా వేలం పాట జరి గితే వాటిని గుర్తించి ఎన్నికల సంఘానికి వివరాల ను అందిస్తాం. – తిరుమల, ఎంపీడీవో, మోర్తాడ్
క్రిమినల్ కేసులు ఎదుర్కొంటారు
సర్పంచ్, వార్డు స్థానాలకు ఎక్కడైనా వేలం పాట నిర్వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వీ డీసీలు వేలం పాటలు నిర్వహించకుండా సహకరించాలి. పదవులకు వేలం వేయడం చట్టాన్ని ఉల్లంఘించినట్లే. అలాంటి విధానం సమంజసం కాదు. – సత్యనారాయణ, సీఐ, భీమ్‌గల్
ఏకగ్రీవాల పేరుతో పదవులు కట్టబెడితే ఎన్నిక రద్దు చేసే అవకాశం
సమష్టి నిర్ణయమని పరిశీలనలో
తేలితేనే అధికారుల ఆమోదం
వేలంపాట ఎన్నికలపై గతంలో
చట్ట ప్రకారం చర్యలు


