నిజామాబాద్‌అర్బన్ : క్రీడారంగంలో జిల్లా అద్వితీయ ప్రతిభను కలిగి ఉండటం ఎంతో గర్వించదగ్గవిషయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, యెండల సౌందర్య, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని కొనియాడారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు ముందుకుసాగాలని, జిల్లా ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చీఫ్ మినిస్టర్ కప్–2025 క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ అభినందిస్తూ, వారికి మెడల్స్, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగిన అనేకమంది క్రీడాకారులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. తాను కూడా కళాశాలలో చదివే రోజుల్లో స్విమ్మింగ్‌లో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. క్రీడా సదుపాయాల మెరుగుదలకు, ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంల ఏర్పాటు కోసం జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక కృషి చేస్తామని, వీటి ఏర్పాటు ఆవశ్యకతను ప్రభుత్వానికి నివేదిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. సీఎం కప్ క్రీడాపోటీల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో గ్రామీణస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 31,353 మంది క్రీడాకారులు వివిధ దశలలో పాల్గొనడం ద్వారా జిల్లాను మొదటి స్థానంలో నిలిపారని అన్నారు. 2700 మంది జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో 53 పతకాలు సాధించారన్నారు. దీంతో రాష్ట్రస్థాయిలో టాప్–5లో జిల్లా నిలిచిందని అభినందించారు. కోచ్‌లు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చూపాలని కలెక్టర్ ఉద్బోధించారు. చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభ చూపితే, అద్భుత అవకాశాలు దక్కుతాయని, ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని సూచించారు. అనంతరం అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్, భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ గుగులోత్ సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఘనంగా సత్కరించారు. కోచ్‌లు, ఆయా పాఠశాలల వ్యా యామ ఉపాధ్యాయులు, సిబ్బంది, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీవైఎస్‌వో పవన్ కుమార్, డీఈవో అశోక్, స్టేట్ గేమ్స్ ఫెడ రేషన్ కార్యదర్శి నాగమణి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ బొబ్బిలి నర్సయ్య, క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


