మారుతినగర్‌లో సైబర్‌మోసం | - | Sakshi
Sakshi News home page

మారుతినగర్‌లో సైబర్‌మోసం

Nov 19 2025 6:17 AM | Updated on Nov 19 2025 6:17 AM

మారుతినగర్‌లో సైబర్‌మోసం

మారుతినగర్‌లో సైబర్‌మోసం

42 మందికి కౌన్సెలింగ్‌ రేషన్‌ బియ్యం పట్టివేత

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ పీఎస్‌ పరిధిలోని మారుతినగర్‌లో ఓ వ్యక్తి సైబర్‌ మోసానికి గురయ్యాడు. బాధితుడు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి సైబర్‌ నేరస్తులు రూ. పది లక్షలు మాయం చేశారన్నారు. ఆదివారం ఉదయం ఫోన్‌ వినియోగిస్తుండగా ఒక్కసారిగా దానికదే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యిందన్నారు. సోమవారం ఉదయం వరకు అలాగే ఉండడంతో కస్టమర్‌ కేర్‌ వారిని సంప్రదించినట్లు తెలిపారు. నెంబర్‌ బ్లాక్‌ చేయాలని వచ్చిన అభ్యర్థన మేరకు తాము అలాచేశామని వారు వివరించడంతో తన నుంచి ఎలాంటి అభ్యర్థన చేయలేదని చెప్పి బ్లాక్‌ నుంచి తీయించారు. తిరిగి ఫోన్‌ ఆన్‌ అయిన వెంటనే తన అకౌంట్‌లో ఉన్న రూ. 17 లక్షల నుంచి రూ. ఐదు లక్షల చొప్పున రెండు సార్లు బ్యాంక్‌ ఖాతా నుంచి డ్రా అయినట్లు సందేశాలు వచ్చాయన్నారు. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

బోధన్‌టౌన్‌: పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి నిర్వహించిన ఆపరేషన్‌ ఛబుత్రాలో 42 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ మంగళవారం తెలిపారు. పట్టణ పీఎస్‌ పరిధిలోని రాకాసీపేట్‌, గోషాల ప్రాంతాల్లో అర్ధరాత్రి ఆపరేషన్‌ ఛబుత్ర నిర్వహించారు. అవసరం లేకున్నా అర్ధరాత్రి రోడ్లపై తిరగడం, వాహనాలను ఇష్టారీతిగా శబ్దాలు చేస్తూ తిరుగుతున్న 42 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. తల్లితండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఐ కోరారు.

సిరికొండ: మండలంలోని కొండాపూర్‌ గ్రామ పరిధిలో ఉన్న రవీందర్‌గౌడ్‌ రైస్‌మిల్లులో 11 టన్నుల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రైస్‌ మిల్లుపై దాడి చేయగా మూడు వాహనాల్లో తీసుకొచ్చిన బియ్యాన్ని పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏఎస్‌వో రవిరాథోడ్‌ వచ్చి వివరాలు సేకరిస్తున్నారని ఎస్సై తెలిపారు. ధర్పల్లి సీఐ భిక్షపతి, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మిల్లులో ధాన్యం, బియ్యం నిల్వల పూర్తి వివరాలు సేకరణ జరుగుతున్నట్లు వెల్లడించారు. వారి పంచనామా ప్రకారం కేసు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement