వరి నారుమడిలో యాజమాన్యం
రుద్రూర్: ప్రస్తుతం చలికాలం కావడంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరగడంతో వరి నారుమడి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కో–అర్డినేటర్ సుప్రజ రైతులకు సూచిస్తున్నారు. చలి ప్రభావం వల్ల వరి నారు ఆకు కొనలు ఎర్రబడడం, ఎండిపోవడం, కొన్నిసార్లు చనిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చలి నుంచి రక్షణ: నారుమడిపై కర్రలతో ఊతమిచ్చి సాయంత్రం వేళల్లో పాలిథిన్ లేదా టార్పలిన్ షీట్‌తో కప్పాలి. మరుసటి రోజు ఉదయాన్నే షీట్ తీసివేయాలి.
జింకు లోప లక్షణాల నియంత్రణ: నారు ఆకుల కొనలు ఎండిపోవడం, గోధుమ రంగు మచ్చలు కనిపించడం వంటివి జింకు లోప లక్షణాలు. నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి, పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయండి.
నీటి యాజమాన్యం: రాత్రి వేళల్లో నారుమడిని నీటితో నింపి చలి ప్రభావాన్ని తగ్గించాలి. తెల్లవారుజామున నీటిని తీసివేసి తాజా నీరు పెట్టాలి.
రోగ నిరోధకత కోసం: వరి నారు ఆరోగ్యంగా పెరగడానికి, యూరియా వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియాకు 2 గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజెట్ మిశ్రమ మందు కలిపి వేయాలని వివరించారు.


