బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుంది. ప్రస్తుతం 9454 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8వేల క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులుతో నిండుకుండలా ఉంది.
36.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి..
ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండటంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బయిన్‌ల ద్వారా 36.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 78.8 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్‌కో అధికారులు తెలిపారు.
సిరికొండ: చిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణకు ఇటీవల పితృ వియోగం కలిగిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని పాకాల గ్రామంలో ఉన్న పూర్ణను శనివారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరామర్శించారు. పూర్ణ తండ్రి దేవిదాస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పూర్ణకు గత ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు.ఆమె తండ్రి వైద్యా నికి అయిన ఖర్చులను కూడా సీఎంతో మాట్లా డి ఇప్పిస్తానని తెలిపారు.అనంతరం పోత్నూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ నర్సయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. నాయకులు బాకా రం రవి, భాస్కర్‌రెడ్డి, ఎర్రన్న, నరేష్, బాల్‌రాజ్‌నాయక్, చందర్‌నాయక్, రాంరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాన్‌సింగ్, దేవరాజు, లియాఖత్ అలీ తదితరులు ఉన్నారు.
ఆర్మూర్: ఆత్మరక్షణ కోసం విద్యార్థులు తైక్వాండో లాంటి క్రీడల్లో శిక్షణ పొందాలని జిల్లా అధ్యక్షుడు ఈరవత్రి రాజశేఖర్ సూచించారు. పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో శనివారం తైక్వాండో పోటీలను నిర్వహించారు. తైక్వాండో గ్రాండ్ మాస్టర్ భోజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీల్లో 108 మంది క్రీడాకారులు పాల్గొనగా బెల్టులు సాధించిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. కరాటే కోచ్ రాజు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, కొండి రాంచందర్, టైలర్ వినోద్ పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో


