వీసాలు ఉచితమే !
మోర్తాడ్(బాల్కొండ): వలస కార్మికుల కొరతను తీర్చుకోడానికి గల్ఫ్ దేశాల్లోని పలు కంపెనీలు 1980లో ఉచిత వీసాలు జారీ చేసి కార్మికులను తరలించుకునిపోయాయి. అప్పట్లో కార్మికుల కుటుంబాలకు అడ్వాన్సు వేతనం చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్సుగా వేతనం అందించకపోయినా ఉచితంగానే వీసాల జారీకి కొన్ని కంపెనీలు శ్రీకారం చుట్టాయి. ఉచిత వీసాలు పొందిన వలస కార్మికులకు విమాన చార్జీలు సైతం ఆయా కంపెనీలు చెల్లిస్తున్నాయి. 45 ఏళ్ల తరువాత పాత విధానం పునరావృతం అవుతుండటంతో వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అబుదాబిలో కేటరింగ్, క్లీనింగ్ విభాగాలలో ఉపాధి కల్పించడానికి అక్కడి ఏడీఎన్‌హెచ్ కంపెనీ ఇక్కడి జీటీఎం ఇంటర్నేషనల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించింది. జగిత్యాల్, నిజామాబాద్‌లలో నిర్వహించిన రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఎంపికై న 125 మంది వలస కార్మికులు నాలుగు విడతల్లో యూఏఈలోని ఆబుదాబికి పయనమయ్యారు. ఉచిత వీసా, ఉచిత విమాన టిక్కెట్‌లను కంపెనీ భరించగా నిజామాబాద్ నుంచి ముంబైకి వెళ్లడానికి బస్సు చార్జీలను మాత్రం కార్మికులు చెల్లించుకున్నారు. ఏడీఎన్‌హెచ్ కంపెనీ జీటీఎం సంస్థ ద్వారా ఉచిత వీసాల జారీకి రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించడం ఇది 15వ సారి కావడం విశేషం. రెండు, మూడు నెలలకు ఒకసారి ఉచితంగానే వీసాల జారీ ప్రక్రియను నిర్వహిస్తూ వలస కార్మికులకు ఆర్థిక భారం తప్పిస్తున్నారు. 1980 నుంచి ఐదేళ్లపాటు ఉచితంగా వీసాలను జారీ చేశారు. ఆ తరువాత రిక్రూటింగ్ ఏజెన్సీలు కోకొల్లలుగా పుట్టుకొచ్చి వలస వెళ్లే వారికి వీసాల కోసం భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది దళారులు వలస కార్మికులను నిండా ముంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో వీసాకు రూ.75 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ వసూలు చేశారు. కొంత మంది ఏజెంట్లు టిక్కెట్‌ల కోసం అదనంగా డబ్బులు గుంజారు. ఇప్పుడు మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే లైసెన్స్‌డ్ ఏజెన్సీ ద్వారా ఏడీఎన్‌హెచ్ కంపెనీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలను నిర్వహిస్తూ వలస కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామమని అంటున్నారు.
1980 నాటి వీసాల జారీ
విధానం పునరుద్ధరణ
అప్పట్లో వలస కార్మికులకు ఉచితంగానే వీసాలు ఇచ్చిన గల్ఫ్ కంపెనీలు
మధ్య కాలంలో డబ్బులు చెల్లిస్తేనే వీసాలు పొందే విధానం అమలు
మోసాలకు గురైన వలస
కార్మికులు ఎందరో..
వీసాలు ఉచితమే !


