కమనీయం.. శ్రీలక్ష్మీనృసింహుల కల్యాణం
పట్టువస్త్రాలు సమర్పించిన సర్వ సమాజ్ కమిటీ ● నింబాచలంపై భక్తుల సందడి
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నింబాచలం (లింబాద్రి గుట్ట) వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం వైభవంగా సాగింది. అ ఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుని కల్యాణా న్ని తిలకించిన భక్తజనం భక్తి పారవశ్యంతో పులకించారు. ఉదయం గర్భాలయంలో ప్రధా న యాగ్నికులచే స్వామివారి కల్యాణం జరిపించారు. అనంతరం స్వర్ణాలంకార భూషితులైన శ్రీలక్ష్మీనృసింహుని ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణతో గర్భాలయం నుంచి కల్యాణ మండపానికి పుష్పాలతో అలంకరించిన పల్లకిలో తీసుకొచ్చారు. ఉత్సవంలో భాగంగా కలశ పూజ, విశ్వక్సేన పూజ నిర్వహించి శ్రీలక్ష్మీనృసింహుడికి రక్షాబంధనం చేశారు. శ్రీలక్ష్మీనృసింహుడి దోసిలిపై శ్రీలక్ష్మీ దేవి దోసిలిని ఉంచి అర్చకులు కన్యాదానం చేశారు. స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, బంగారు బాషింగాలు సమర్పించారు. ఆలయ అర్చకులు, పురోహితులు మాంగళ్యం తంతునానేనా అంటూ శ్రీవారి కల్యాణం జరిపించారు. భీమ్‌గల్ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనృసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.


