
పకడ్బందీగా సీ్త్రనిధి రుణాలు
● పక్కదారి పట్టకుండా
సాంకేతిక విధానం
● లబ్ధిదారుల ఫేస్ క్యాప్చరింగ్,
బయోమెట్రిక్ తప్పనిసరి
డొంకేశ్వర్(ఆర్మూర్) : సీ్త్రనిధి రుణాల పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. రుణాలు పక్కదారి పట్టకుండా లబ్ధిదారుల అనుమతి, సమ్మతి తప్పనిసరి చేసింది. అంతే కాకుండా ఎస్‌హెచ్‌జీ సభ్యురాలి ఫేస్ క్యాప్చరింగ్, బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతే రుణం మంజూరు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త సాంకేతిక విధానం సత్ఫలితాలనిస్తోంది. తద్వారా సీ్త్రనిధి రుణాలు పక్కదారి పట్టే అవకాశం లేకుండాపోయింది. జిల్లాలో 806 గ్రామ సంఘాలు, వీటి పరిధిలో 24,179 మహిళా సంఘాలు ఉండగా 2.53 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. అయితే సంఘాల్లో ఉన్న పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం వివిధ వ్యాపారాలు, వ్యక్తిగతంగా సీ్త్రనిధి పథకం ద్వారా ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. రూ.50వేల నుంచి మొదలుకొని రూ.5 లక్షల దాకా రుణాలు పొందే అవకాశం కల్పించింది. కిరాణం, బట్టల దుకాణం, జనరల్ స్టోర్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, పేపర్ ప్లేట్స్, జూట్ బ్యాగ్స్ తయారీ, ఇంటర్నెట్ సెంటర్, నాటు కోళ్లు, పెరటి కోళ్ల పెంపకం, ఎలక్ట్రికల్ బైక్స్, ఈ–ఆటోలు తదితర వ్యాపారాలు చేసేందుకు రుణాలు అందజేస్తున్నారు. సీ్త్రనిధి రుణం కావాలంటే లబ్ధిదారుల లైవ్ ఫొటో, వేలిముద్రలు, ఆధార్, ఫోన్ నంబర్ వంటి వివరాలను ట్యాబ్‌లో ఎంట్రీ చేస్తున్నారు. కాగా సంఘంలోని ఇద్దరు లీడర్ల ఫొటోలను సైతం తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు రూ.111కోట్ల రుణాలు పంపిణీ
గతేడాది జిల్లాలో రూ.211 కోట్లు రుణాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది రూ.246 కోట్ల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 653 గ్రామ సంఘాల పరిధిలో 12,927 మంది మహిళలకు రూ.111 కోట్ల రుణాలను అందజేశారు. మిగిలిన లక్ష్యాన్ని 2026 మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది.
ప్రభుత్వం తెచ్చిన సాంకేతిక విధానంతో పారదర్శకంగా రుణాలు పంపిణీ చేస్తున్నాం. జిల్లాకు నిర్దేశించిన రుణ పంపిణీ లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాం. రోజుకు రూ.1.50 కోట్ల రుణాలను ఎస్‌హెచ్‌జీలకు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుని క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి పని చేస్తున్నాం.
– రాందాస్, సీ్త్రనిధి ఆర్‌ఎం, నిజామాబాద్

పకడ్బందీగా సీ్త్రనిధి రుణాలు