
మాలల రిజర్వేషన్ల సాధనే ధ్యేయం
● మంత్రి పదవిపై ఆశ లేదు
● ఐక్యంగా ఉండి హక్కులు
సాధించుకోవాలి
● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
వివేక్ వెంకటస్వామి
నిజామాబాద్ నాగారం: తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, మాల జాతి ఐక్యత, రిజర్వేషన్లు సాధించడమే ప్రధాన ధ్యేయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లి మాలలకు 12 శాతం నుంచి 18 శాతం వరకు రిజర్వేషన్ కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు. నగరంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్‌లో దివంగత వెంకటస్వామి (కాక) జయంతి వేడుకలు, మాలల ఐక్య సదస్సు ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి వివేక్ మాట్లాడారు. మాలలంతా ఏకతాటిపై నిలబడి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ మాలల ఐక్యతను చూస్తే సంతోషంగా ఉందన్నారు. కొందరు ఉన్నతవర్గాల ఉద్యోగులు ప్రధానంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే మాల ఉద్యోగులను తొలగించడం, బదిలీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మాలలు ఐక్యతతోనే కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. మాలలకు వర్గీకరణ విషయంలో అన్యాయం జరిగిందని, దానిపై నిరంతరం పోరాడుతున్నామని వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. తమ పోరాటానికి అన్ని కులసంఘాలు సహకరించాలని కోరారు. రాజకీయాల్లో సైతం కులవివక్ష కొనసాగుతుందని తెలిపారు. అనంతరం గ్రూప్–1, గ్రూప్–2లో విజయం సాధించిన అభ్యర్థులను సన్మానించారు. కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు ఆలుక కిషన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవదాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.