
కుండీల్లో మిగిలింది సగమే..
● సగం చేప పిల్లలు మృత్యువాత
● 80 రోజులు దాటినా పంపిణీకి
నోచుకోని వైనం
బాల్కొండ : ఎస్సారెస్పీ దిగువన ఉన్న జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి చేసిన చేప పిల్లలు 80 రోజులు దాటినా పంపిణీకి నోచుకోలేదు. ఫలితంగా చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. సాధారణంగా ఉత్పత్తి చేసిన 40 నుంచి 45 రోజుల్లోనే చేపపిల్లలను పంపిణీ చేయాలి. కానీ, ప్రభుత్వం ఉచితంగా చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు పిలిచిన టెండర్లు ఇప్పటికీ ఖరారు కాలేదు. దీంతో పంపిణీ ప్రారంభించలేదు. ఆ ప్రభావం చేపపిల్లల పెంపకంపై పడింది. 54 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం 25 లక్షల చేప పిల్లలు మాత్రమే ఉన్నాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
మరికొన్ని రోజులు గడిస్తే మరిన్ని చేపపిల్లలు మృత్యువాత పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సైజ్ ఎక్కువగా పెరగడంతో అన్ని చేప పిల్లలకు నర్సరీలో కావాల్సిన ఆక్సిజన్ అందక చనిపోతాయని పేర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చేప పిల్లల పంపిణీ ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
చేప పిల్లల పంపిణీ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. చేపపిల్లలు కుండీల్లోనే చనిపోతున్నాయి. ఈ విషయాన్ని సైతం ఉన్నతాధికారులకు వివరించాం. టెండర్లు పూర్తయ్యాక పంపిణీ చేసే అవకాశం ఉంది. – దామోదర్,
మత్స్య అభివృద్ధి అధికారి, పోచంపాడ్