
క్రైం కార్నర్
చెరువులో పడి వ్యక్తి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన జోగిని చిన్న మల్లయ్య(62) చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. మృతుడు రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. బతుకమ్మ పండుగకు స్వగ్రామం వచ్చాడు. సెప్టెంబర్ 28న డబ్బుల విషయంలో భార్యతో గొడవపడి రంగంపేటలోని తన పెద్ద కొడుకు వద్దకు వెళ్లాడు. తిరిగి 30వ తేదీన అయిలాపూర్‌కు చేరుకున్నాడు. ఇంటికి వెళ్లకుండా గ్రామం పక్కనే ఉన్న చెరువులో బట్టలు ఉతుకుంటూ ప్రమాదవశాత్తు కాలుజారి నీటమునిగి చనిపోయినట్లు ఎస్సై పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
● జ్వరంతో బాలుడు మృతి
మాచారెడ్డి : జ్వరంతో బాధపడుతూ పది నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని సర్దాపూర్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ అశోక్, వెన్నెల దంపతుల కుమారుడు వేదాంశ్(10 నెలలు) జ్వరంతో ఐదురోజులుగా బాధపడుతున్నాడు. దీంతో రాజన్నసిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ఓ పిల్లల ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉందని నీలోఫర్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
బాల్కొండ: మండలంలోని కిసాన్‌నగర్‌కు చెందిన మమత(38) వరద కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మమత కొన్నాళ్లుగా కుటుంబకలహాలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జీవితంపై విరక్తి చెంది ఎస్సారెస్పీ నుంచి ప్రవహించే వరద కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

క్రైం కార్నర్