
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా.. డిచ్‌పల్లి మండలం రాంపూర్‌కు చెందిన మంజూరు హుస్సేన్(47) అనే వ్యక్తి కొంతకాలంగా మార్కెటింగ్ వృత్తి చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం అతడు బైక్‌పై నిజామాబాద్ వైపు బయలుదేరాడు. దగ్గి దర్గా శివారులో అతడు ఎడమ వైపు ఉన్న టాటా ఏస్‌ని ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లగా, ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడు కిందపడిపోయి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు హెల్మెట్ ధరించినప్పటికీ, సరిగా లేకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
కుప్రియాల్ గ్రామ శివారులో..
మండలంలోని కుప్రియాల్ గ్రామ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డికి చెందిన ముత్తినే ని సూర్యరావు (రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్) కొన్నేళ్లుగా హైవేపై ఉన్న శ్రీ కృష్ణ ఉడిపి హోటల్‌లో పని చేస్తున్నారు. శనివారం ఉదయం అతడు కామారెడ్డి నుంచి తన ద్విచక్ర వాహనంపై హోటల్‌కు బయలుదేరాడు. కుప్రియాల్ శివారులో అతడిని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపునకు వెళ్తున్న రెనాల్డ్ క్విడ్ కారు అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.