
కుళ్లుతున్న సోయా..
డొంకేశ్వర్(ఆర్మూర్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సోయా పంటకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 33,603 ఎకరాల్లో సోయాను సాగు చేశారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చేది. కానీ, ఆగకుండా వర్షాలు పడడంతో విత్తన కాయలు రంగు మారుతున్నాయి. దీంతో రైతులు సోయాపై ఆశలు వదులుకుంటున్నారు. ఎకరానికి ఐదారు క్వింటాళ్ల దిగుబడి వస్తే అదే చాలనుకుంటున్నారు. వర్షాల కారణంగా సోయా పంట నష్టపోయిన వారికి పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
దిగుబడి వస్తుందో లేదో..
రెండు ఎకరాల్లో సోయా పంట సాగు చేశాను. కురుస్తున్న వర్షాలకు పంట దెబ్బతింటోంది. వాన ఆగితేనే కోత కోయడానికి అవకాశముంది. దిగుబడి విషయానికి వస్తే ఎకరానికి ఐదు క్వింటాళ్లు కూడా వస్తుందో లేదో. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి.
–చిన్నారెడ్డి, గాదేపల్లి, డొంకేశ్వర్ మండలం