
డిపాజిట్ల పేరిట రూ. 8.5 కోట్ల టోకరా
మకాం మార్చిన నిందితులు
● యూఎస్ డాలర్, క్రిప్టో కరెన్సీ,
ట్రేడింగ్ అంటూ ఆన్‌లైన్ దందా
● ఇద్దరు నిందితుల అరెస్ట్
ఖలీల్‌వాడి: అనుమతి లేకుండా కంపెనీలు పెట్టి 125 మంది నుంచి డిపాజిట్ల పేరిట డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు క్రైం బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర చారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీసీఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన మొయిజ్ ఖాన్, మహమ్మదీయ కాలనీకి చెందిన సయ్యద్ మహ్మద్ హాసన్ ఇద్దరు స్నేహితులు. 2022–23లో షైన్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో డిపాజిట్ పెడితే రూ. లక్షకు 10 శాతం వరకు అందిస్తామని నమ్మబలికారు. కొంతమంది మిత్రులు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని 125 మంది నుంచి రూ.8.5 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఆ తర్వాత మొయిజ్‌ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్‌లు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చారు. డిపాజిటర్లు ఒత్తిడి చేయడంతో మకాం మార్చారు. దీంతో ఇందల్వాయి మండలంలోని లో లం గ్రామానికి చెందిన హకీం ఫిర్యాదు చేయడంతో సీపీ పోతరాజు సాయిచైతన్య కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు అనంతరం మొయిజ్‌ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు.
మొయిజ్‌ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్‌లు నిజామాబాద్ నుంచి మకాం మార్చి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి నుంచి ఆన్‌లైన్‌లో క్రిప్టో, యూఎస్ డాలర్, ట్రేడింగ్ పేరిట యాప్ ద్వారా వసూళ్లకు తెర లేపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. కాగా, వీరి వలలోపడి ఎంతమంది ప్రజలు మోసపోయారో తెలియాల్సి ఉందని ఏసీపీ నాగేంద్రచారి తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లో ఓ భూమిని నిందితులిద్దరూ కలిసి కొనుగోలు చేసి రూ. 25 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐలు రవీందర్, సురేశ్, కానిస్టేబుళ్లు ఉన్నారు.