
జీఎస్టీతో దేశప్రజలపై లక్షల కోట్ల భారం వేసిన మోదీ
● ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్: కొత్తగా జీఎస్టీ అమలులోకి తెచ్చి దేశ ప్రజలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్షల కోట్ల భారం వేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో దేశ ప్రజల నుంచి అక్రమంగా దోచిన రూ. 22 లక్షల కోట్ల నుంచి కేవలం రూ. 2 లక్షల కోట్లు తగ్గించి, ప్రజలకు ఏదో చేశామని బీజేపీ నాయకులు జబ్బలు చరుచుకుకుంటూ ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణాలోని ప్రతి వ్యక్తికి నెలకు రూ. 5 వేలు మిగిల్చామని ఎంపీ అర్వింద్ అంటున్నారని, గత తొమ్మిదేళ్లలో తెలంగాణాలోని ప్రతి వ్యక్తి నుంచి రూ. 5,40,000 కేంద్రం దోచుకున్నట్లు ఒప్పుకున్నట్లే కదా అని పేర్కొన్నారు. ఎంపీలు ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని, జీఎస్టీ పెట్టుమని అడిగింది ఎవరని ప్రశ్నించారు. 2017 నుంచి కొత్తగా జీఎస్టీ తెచ్చి నిత్యావసర సరుకులు, అన్ని రకాల వాహనాలు, ఇతర వస్తువులపై ధరలు పెంచింది మీరు కాదా? అని అన్నారు. జీఎస్టీ పేరుతో మోసం చేస్తున్నదెవరో ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు ఓట్ల కోతలు పెట్టడం ఖాయమన్నారు.