
మోతాదుకు మించి యూరియా వాడొద్దు
జిల్లా వ్యవసాయాధికారి గోవింద్
వేల్పూర్: మోతాదుకు మించి యూరియా వాడటంతో పంటలకు తెగుళ్ల వస్తాయని, వాతావరణం సైతం కలుషితమవుతుందని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన వేల్పూర్, అంక్సాపూర్ గ్రామాలలోని ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేశారు. స్టాకును పరిశీలించి మాట్లాడారు. 2025–26 ఏడాదిలో ఇప్పటి వరకు జిల్లాలో 2985.03 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందన్నారు. అవసరానికి మించి కొనే యూరియాతో కృత్రిమ కొరత ఏర్పడుతుందని, అంతేగాక రైతులపై పెట్టుబడి భారం పెరుగుతుందన్నారు. సంప్రదాయ యూరియాకు బదులుగా నానో యూరియా వాడాలని, ఇది ఆకులపై ద్రవరూపంలో పిచికారీ చేయడంతో మొక్కలలో పోషణ ఎక్కువగా జరిగి, దిగుబడి 8 శాతం వరకు పెరుగుతుందని చెప్పారు. ఆయన వెంట వ్యవసాయాధికారి శృతి, సొసైటీ కార్యదర్శి కృష్ణ, సతీశ్, సుభాష్ ఉన్నారు.