
నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావాలి
సుభాష్‌నగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నష్టాల్లో ఉన్న డీసీసీబీ శాఖలను లాభాల్లోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని ఎన్‌డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి అన్నారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయా బ్రాంచీల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.2400 కోట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.2400 కోట్లలో రూ.787 కోట్లు డిపాజిట్లు, రూ.1613 కోట్ల రుణాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఉద్యోగి లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిబద్ధతతో పని చేయడంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. నష్టాల్లో ఉన్న శాఖలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో శాఖాధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీఈవో నాగభూషణం వందే, ఇతర ఉన్నతాధికారులను చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. డీజీఎంలు లింబాద్రి, అనుపమ, సుమమాల, గజానంద్, ఉన్నతాధికారులు, 63 బ్రాంచీల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.