
రైతులు నానో యూరియా వాడాలి
డీఏవో మేకల గోవింద్
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతులంతా బస్తాల్లో లభించే యూరియా కాకుండా బాటిళ్లలో ద్రవరూపంలో ఉండే నానో యూరియాను వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ సూచించారు. గురువారం డొంకేశ్వర్ మండల కేంద్రానికి వచ్చిన ఆయన సొసైటీ గోదాములను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, అమ్మకాలను రిజిస్టర్లలో తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా కొరత ఏమాత్రం లేదని, రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయకూడదన్నారు. యూరియాను ఎక్కువగా వినియోగించడంతో నేలకు, పంటలకు ప్రమాదమన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఎలాంటి దుష్ప్రభావాలు లేని నానో యూరియాను వాడాలని సూచించారు. ఇది రెండు బస్తాలతో సమానమని, రైతులకు శ్రమ కూడా తగ్గుతుందన్నారు. అనంతరం నూత్‌పల్లిలో వరి పంటను పరిశీలించారు. సరిపడా ఎరువులు సరఫరా చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశరం భూమేశ్ రెడ్డి, రైతులు కలిసి డీఏవోను సన్మానించారు. మండల వ్యవసాయాధికారి మధుసూదన్, ఏఈవోలు మౌనిక, ప్రశాంత్ ఉన్నారు.