
శిక్షణ పూర్తి చేసుకొని స్వయం ఉపాధి పొందాలి
● ఎస్‌బీఐ ఏజీఎం రంజిత్‌కుమార్ నాయుడు
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్ధ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని ఎస్‌బీఐ ఏజీఎం (ఏవో, నిజామాబాద్) రంజిత్‌కుమార్ నాయుడు సూచించారు. డిచ్‌పల్లి ఆర్‌ఎస్‌ఈటీఐను గురువారం ఆయన సందర్శించారు. మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీ పార్లర్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో మగ్గం వర్క్, టైలరింగ్, బ్యూటీపార్లర్‌లకు మంచి డిమాండ్ ఉందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ గ్రామాలకు వెళ్లిన తర్వాత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా నిలబడాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఈటీఐ ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ రవికుమార్, ఎస్‌ఐబీ చీఫ్ మేనేజర్ రవికుమార్, సంస్థ సిబ్బంది రామకృష్ణ, నవీన్, భాగ్యలక్ష్మి, లక్ష్మణ్, గెస్ట్ ఫ్యాకల్టీ ఫరీదా, సుజాత తదితరులు పాల్గొన్నారు.