
రక్తదానంతో మేలు
● వీసీ ప్రొఫెసర్ యాదగిరిరావు
తెయూ(డిచ్‌పల్లి): రక్తదానం చేయడమంటే ప్రాణదానమేనని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు అన్నారు. రక్తదాన్ అమృత్ మహోత్సవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం తెయూలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కే.రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం మూడుసార్లు రక్తదానం చేయాలని సూచించారు. దీంతో తలసేమియా వ్యాధితోపాటు అత్యవసర చికిత్సలు అవసరమున్న వారికి ఎంతో మేలు చేసినట్లవుతుందన్నారు. రక్తదాన కార్యక్రమాలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. వర్సిటీ విద్యార్థులతోపాటు జీజీ కాలేజ్, ఎస్‌ఎస్‌ఆర్, వాగ్ధేవి (నిజామాబాద్), ఆర్కే డిగ్రీ కాలేజ్ (కామారెడ్డి), తెలంగాణ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, పీఆర్వో పున్నయ్య, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు స్వప్న, స్రవంతి, అలీమ్‌ఖాన్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.