
పకడ్బందీగా ఎస్‌ఐఆర్
● పొరపాట్లు, తప్పిదాలకు తావుండొద్దు
● వీసీలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన
అధికారి సి సుదర్శన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 ప్రక్రియను అన్ని నియోజకవర్గాల పరిధిలో పకడ్బందీగా చేపట్టేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. కలెక్టర్, ఈఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఆయన ఎస్‌ఐఆర్ ప్రక్రియపై మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను చేపట్టాలని, అందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బీహార్ రాష్ట్ర సాధారణ ఎన్నికల దృష్ట్యా ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యిందని గుర్తు చేశారు. మన వద్ద సైతం ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. 2002 ఓటరు జాబితాతో 2025 జాబితాను సరిపోల్చుకోవాలని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ నిర్వహణపై సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలకు శిక్షణ అందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా పోషణ మాసం..
పిల్లల్లో పోషలోపాన్ని అధిగమించేందుకు పోషకాహారాన్ని అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా, నిజాయితీగా పని చేయాలని కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణమాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసాన్ని పక్కాగా నిర్వహించాలన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించడమే పోషణ మాసం ముఖ్య ఉద్దేశమని అన్నారు. డీఆర్డీవో సాయాగౌడ్, డీడబ్ల్యూవో రసూల్ బీ, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ, డీఈవో అశోక్, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్‌జర్లు పాల్గొన్నారు.