
తల్లిని చంపిన కొడుకు అరెస్టు
బాన్సువాడ: తల్లిని సాకలేక మంజీర నదిలో తోసేసిన కొడుకును అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బోర్లం గ్రామానికి చెందిన సాయవ్వ(75)కు కొడుకు బాలయ్య ఉన్నాడు. వృద్ధురాలైన సాయవ్వ గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయింది. ఆమెకు సేవలు చేయడానికి ఇంట్లో ఎవరూ లేరు. దీంతో కొడుకు బాలయ్య ఆమెను సాకలేక ఈనెల 8న ఓ మైనర్‌తో కలిసి సాయవ్వను బైక్‌పై ఎక్కించుకొని బోలక్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి బ్రిడ్జి పైనుంచి నదిలోకి తోసివేశాడు. ఈ 11న సాయవ్వ మృతదేహం నదిలో తేలడంతో ఈనెల 12న బోర్లం గ్రామ పెద్దలు బాలయ్య వద్ద ఉన్న మైనర్‌ను పట్టుకొని ప్రశ్నించారు. అతడు సాయవ్వను కొడుకే నదిలో పడేశాడని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కొడుకు కోసం గాలింపు చేపట్టారు. ఈనెల 14న నిందితుడు ఎర్రోళ్ల బాలయ్యతోపాటు మైనర్ కలిసి బోర్లం నుంచి వస్తుండగా కొయ్యగుట్ట చౌరస్తా వద్ద అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. వారి వద్ద ఉన్న బైక్‌ను, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాలయ్యను రిమాండ్‌కు తరలించామని, మైనర్‌ను జువైనల్ అబ్జర్వేషన్ హోంకు తరలించామని అన్నారు.