
అంగన్‌వాడీల ఆందోళన బాట
అంగన్‌వాడీల సమాచారం
సమస్యలు పరిష్కరించాల్సిందే
మావి న్యాయమైన డిమాండ్లు..
నిజామాబాద్‌నాగారం: సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఉద్యమబాట పట్టాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల బాగోగులను అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు చూసుకుంటున్నారు. నిత్యం వారికి పాలు, గుడ్లు, పౌష్టికాహారంతోపాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తున్నారు. ఇవే కాకుండా శ్రీమంతాలు, అక్షరాభ్యాసం తదితర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేదని, పనిభారం పెరుగుతోందని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.18వేల వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేసి, ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఖాళీలను భర్తీ చేయాలని, మూడు నెలల పీఆర్సీ, సమ్మె కాలపు వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర డిమాండ్ల సాధనకు తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా సోమవారం మంత్రుల ఇళ్లను ముట్టడించి ధర్నా చేపట్టనున్నారు. అయినా స్పందించక పోతే 25న చలో సెక్రటేరియట్, అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో 5కి.మీల పాదయాత్ర, 17వ తేదీ నుంచి ఆన్‌లైన్ సమ్మె చేపట్టాలని నిర్ణయించారు.
జిల్లాలో సీడీపీవో ప్రాజెక్టులు 5
మొత్తం అంగన్‌వాడీలు 1501
బాలింతలు 61,200
గర్భిణులు 9821
చిన్నారులు 81,262
టీచర్లు 1427
ఆయాలు 901
నేడు మంత్రుల ఇళ్ల ఎదుట ధర్నాలు
25న చలో సెక్రటేరియట్
అక్టోబర్ 8న జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర
17 నుంచి ఆన్‌లైన్ సమ్మెకు పిలుపు
ఏళ్ల తరబడిగా సమస్యలు పరిష్కరించాలని ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. పనిభారం పెరిగిపోతుంది. జీతాలు తక్కువగానే ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఉద్యమిస్తున్నాం.
– పి స్వర్ణ, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
మేము న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వాల ఎదుట ఉంచాం. గత ప్రభుత్వాలు నమ్మించి మోసం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమస్యలు పరిష్కరించాల్సిందే. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో ఆందోళన చేస్తాం.
– కై రి దేవగంగు, జిల్లా అధ్యక్షురాలు