
మురికి కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని శివసాయి కాలనీలోగల మురికి కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. సదరు మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి ప్యాంట్ జేబులో దొరికిన ఆధార్ కార్డులో నిర్మల్ లక్ష్మణ్ పేరు ఉందన్నారు. వయస్సు 42, చిరునామా బ్రాహ్మణపల్లి, ఎడపల్లి మండలం అని ఉందన్నారు. మృతుడు బ్లాక్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ధరించినాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని సీఐ తెలిపారు.
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని అడవిలింగాల్ గేట్ వద్ద ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై ఆదివారం లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొని బురదలో కూరుకుపోయింది. లారీ ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌అండ్‌బీ డీఈ నారాయణ, ఏఈ ఐశ్వర్యలు స్పందించి బ్రిడ్జిపై దిగబడిపోయిన లారీని క్రేన్ల సహాయంతో తొలగించారు.
నారింజపండ్ల లారీ బోల్తా
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారులో నారింజ పండ్ల లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నారింజ పండ్ల లోడ్ తో ఉన్న లారీ ఆదివారం హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌వైపు జాతీయ రహదారిపై వెళ్తోంది. మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారులో ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి బోల్తాపడి సర్వీస్‌రోడ్డుపై పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. లారీలోని పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి.
మట్కా ఆడుతున్న ముగ్గురు అరెస్టు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో మట్కా ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మట్కా స్థావరంపై దాడిచేసి గుజరాతి గోవర్ధన్, వొడుల మోహన్, మహ్మద్ రహీముద్దీన్‌ను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ. 15వేల నగదు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారయిన మట్కా నిర్వాహకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మోపాల్: మండలంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల ఎల్లయ్యపై అకారణంగా దాడిచేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై సుష్మిత ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లయ్య టిప్పర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇదేక్రమంలో ఆదివారం సాయంత్రం గేదెలు అడ్డుగా ఉన్నాయని టిప్పర్‌ను రోడ్డు పక్కన నిలిపాడు. వెనకాల బైక్‌లపై వస్తున్న నిజామాబాద్‌కు చెందిన యువకులు టిప్పర్‌ను ఎందుకు నిలిపావంటూ ఎల్లయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దాడికి పాల్పడ్డారు. ఆరు ద్విచక్ర వాహనాలపై పది మంది యువకులు వచ్చి దాడిచేశారని ఎల్లయ్య ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు అటవీ ప్రాంతంలో చిరుత దా డిచేసి రెండు లేగ దూడలను హతమార్చినట్లు బాధితుడు దూప్‌సింగ్ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆవుల మందను మేతకు అడవికి తీసుకెళ్లగా సాయంత్రం రెండు లేగదూడలు కనిపించలేదని తెలిపారు. లేగదూడల కోసం మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో గాలించగా ఆదివారం కుళ్లిపోయిన లేగదూడల కళేబరాలు కనిపించినట్లు బాధితుడు తెలిపాడు. చిరుత దాడిలోనే లేగదూడలు మృతి చెందాయని, అటవీశాఖ అధికారులు నష్టపరిహారం అందజేయాలని కోరారు.

మురికి కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం