
వ్యర్థాలను డిస్పోస్ చేయని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాల
జక్రాన్‌పల్లి: నిబంధనలకు అనుగుణంగా వ్యర్థాలను డిస్పోస్ చేయని ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామ శివారులోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికల్ వేస్టేజీని నిర్వీర్యం చేసే ప్లాంట్‌ను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. జిల్లాలో 900 వరకు ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులు కొనసాగుతుండగా, సగానికి పైగా ఆస్పత్రుల నుంచి వ్యర్థాలను సేకరించడం లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీకి వ్యర్థాలు అందించని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయాలని, అయినప్పటికీ మార్పు రాకపోతే ఆస్పత్రుల అనుమతులను రద్దు చేయాలని డీఎంహెచ్‌వో రాజశ్రీని ఆదేశించారు. ఏజెన్సీ పనితీరును పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి ఏఈ మానసను ఆదేశించారు.
సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ తనిఖీ..
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని గంగాస్తాన్ ఫేజ్–1లోగల సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ (సీ.డీ.ఎస్)ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. ఇండెంట్ వచ్చిన వెంటనే తాత్సారం చేయకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఔషధాలు పంపించాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలె ప్రమాదం ఉన్నందున అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫార్మసిస్ట్ గంగాధర్‌ను ఆదేశించారు.