
కుక్కర్ పేలి ఎండీఎం కార్మికురాలికి గాయాలు
మాక్లూర్: పాఠశాలలో మధ్యాహ్న భో జనం (ఎండీఎం) వండుతున్న కార్మికురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా.. మండలంలోని అమ్రాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం రాంపూర్ లలిత అనే కార్మికురాలు వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు కుక్కర్ పేలింది. దీంతో కుక్కర్‌లోని పప్పు ముఖంపై చిల్లి తీవ్రంగా గాయపడింది. ఉపాధ్యాయులు వెంటనే గమనించిన ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతంలలిత ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలిసిన ఏఐటీయూసీ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు గురువారం ఆస్పత్రిలో లలితను పరామర్శించారు. లలిత వైద్యఖర్చులన్ని జిల్లా విద్యాశాఖ భరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓమయ్య, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి డిమాండ్ చేశారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
గోడ కూలి వృద్ధ దంపతులకు ..
మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్‌లో ఇంట్లోని గోడ కూలడంతో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. హండేకేలూర్‌లోని ఇంట్లో తుమ్మల్‌వార్ హన్మండ్లు, రుక్మిణీబాయి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ప్రమాదవశాత్తు ఇంట్లోని గోడ కూలి వారిపై పడటంతో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ముజీబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో హన్మండ్లు ఇంటి గోడ నాని తడిసిపోవడంతో కూలిపోయిందని స్థానికులు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండరాదని, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని దరాస్ సాయిలు సూచించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించారు.
బైక్‌ను ఆటో ఢీకొనడంతో దంపతులకు..
ఖలీల్‌వాడి: నగరంలోని కుమార్‌గల్లీ వద్ద ఆటో, బైక్‌ను ఢీకొడంతో ఇద్దరికి గాయాలైన్నట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని కుమార్‌గల్లీ వద్ద బైక్‌పై సాయిలు, అతడి భార్య వెళుతుండగా వెనుక నుంచి ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయిలు, అతడి భార్యకు తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

కుక్కర్ పేలి ఎండీఎం కార్మికురాలికి గాయాలు