అడ్డూఅదుపూ లేని స్కానింగ్‌ దందా | - | Sakshi
Sakshi News home page

అడ్డూఅదుపూ లేని స్కానింగ్‌ దందా

Sep 11 2025 6:20 AM | Updated on Sep 11 2025 6:20 AM

అడ్డూఅదుపూ లేని స్కానింగ్‌ దందా

అడ్డూఅదుపూ లేని స్కానింగ్‌ దందా

నిజామాబాద్‌నాగారం: జిల్లాలో స్కానింగ్‌ సెంటర్లు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయి. ధరల నియంత్రణ లేకపోవడంతో ఒ క్కో సెంటర్లో ఒక్కో రకంగా దోపిడీ కొనసాగుతోంది. రోగుల అత్యవసరాన్ని ఆసరాగా చేసుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నాయి. రిఫరల్‌ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ అందినంత దోచేస్తున్నారు. అర్హతలేని వారితో సెంటర్లను నిర్వహిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.

కన్నెత్తి చూడని అధికారులు..

గర్భిణులతోపాటు కడుపునకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా స్కానింగ్‌ చేయించాల్సిందే. చెస్ట్‌, గ్యాస్ట్రో, లివర్‌ తదితర సమస్యలు తెలుసుకునేందుకూ సంబంధిత వైద్యులు స్కానింగ్‌కు రిఫర్‌ చేస్తున్నారు. అందులో వచ్చే రిపోర్టు ఆధారంగానే వైద్యులు చికిత్స చేస్తారు. గాయాలు, తలనొప్పి, చెస్ట్‌, నరాల సమస్య ఎదుర్కొనే రోగులకు ఆర్థో వైద్యులు ఎక్కువగా ఎక్స్‌ రే, సీటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐలను రాస్తుంటారు.

● ఎక్స్‌ రే కోసం రూ.500 నుంచి రూ.1200, స్కానింగ్‌కు రూ.800 నుంచి రూ.2000 వరకు రోగుల నుంచి నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఇక సీటీస్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐల విషయానికొస్తే ఫీజులు వేలల్లో ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 137 స్కానింగ్‌ సెంటర్లు, 29 ఎక్స్‌రే, 16 సీటీ స్కాన్‌, 4 ఎమ్‌ఆర్‌ఐలు ఉన్నాయి. పలు సెంటర్లలో ధరల నియంత్రణ పాటించడం లేదు. పేరుకు మాత్రమే ధరల బోర్డు ప్రదర్శిస్తూ ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు చేయాల్సిన వైద్యారోగ్యశాఖ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి.

అంతా రిఫరల్‌

జిల్లాలో సీనియర్‌ వైద్యులు సొంతగా ఆస్పత్రులు నడుపుతూ అవసరం ఉంటేనే ఎక్స్‌రే, స్కానింగ్‌, సీటీస్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ చేయించుకోవాలని రోగులకు సలహా ఇస్తున్నారు. కానీ, మేనేజ్‌మెంట్‌ ఆస్పత్రుల్లోని వైద్యులు మాత్రం ప్రతి చిన్న సమస్యకు ఎక్స్‌రే, సీటీస్కాన్‌, స్కానింగ్‌, ఎమ్‌ఆర్‌ఐలు రాస్తున్నారు. ఇలా రిఫరల్‌ దందా చేస్తూ కొంతమంది వైద్యులు కమీషన్లు తీసుకుంటున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రూ.1000 ఫీజుకు రూ.200 చొప్పున కమీషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం.

బోర్డుపై ఓ రేటు..

వసూలు చేసేది మరో రేటు

ఎక్స్‌రే, సీటీస్కాన్‌, ఎమ్మారైలకీ రిఫరల్‌

టెక్నీషియన్లుగా జూనియర్ల చెలామణి

అంతంత మాత్రంగానే తనిఖీలు

తనిఖీలు చేస్తున్నాం..

జిల్లాలోని అన్ని స్కానింగ్‌ సెంటర్లలో ఇప్పటికే తనిఖీలు చేశాం. పలుమార్లు హెచ్చరించాం. స్కానింగ్‌ విషయంలో తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు మా దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సెంటర్లలో మళ్లీ తనిఖీలు చేయిస్తాము. ప్రత్యేక బృందం సైతం తనిఖీలు చేస్తూనే ఉంది.

– రాజశ్రీ, జిల్లా వైద్యాధికారి

జూనియర్లతోనే నిర్వహణ..

ఎక్స్‌రే, స్కానింగ్‌, సీటీస్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ ఏదీ తీ యాలన్నా అనుభవం ఉన్న టెక్నీషియన్‌ ఉండాలి. డీఎమ్‌ఐటీ (డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ) కోర్సు చేసి, శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ, పెద్ద పెద్ద ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో టెక్నీషియన్లకు రూ. 35 వేల నుంచి రూ. 50 వేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో జూనియర్లకు రూ.20 వేల లోపు జీతాలు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. జూనియర్లు ఇచ్చే స్కానింగ్‌ రిపోర్టులో తేడా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement