
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. వివిధ కారణాలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ముందుకురాని వారి స్థానంలో అర్హులైన కొత్త లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇందిరమ్మ కమిటీల ద్వారా కొత్త లబ్ధిదారులకు తెలియజేస్తూ, అందరూ మార్కింగ్ చేసుకొని నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు. లబ్ధిదారులకు సెర్ప్, మెప్మా ద్వారా రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను సైతం వేగవంతం చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను గుర్తించి జాబితాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. పంట పొలాల్లో ఉన్న ఇసుక మేటలను ఉపాధి హామీ కూలీలతో తొలగింపజేయాలన్నారు. పనుల జాతరలో భాగంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరైన మేజిక్ సోక్‌పిట్లు, పశువుల కొట్టాలు, వర్మీ కంపోస్ట్ తదితర నిర్మాణ పనులను వెంటనే చేపట్టి, సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సౌర విద్యుత్ పలకాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమగ్ర వివరాలతో నివేదికలు అందించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీవో సాయాగౌడ్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఈఈ నివర్తి, డీపీవో శ్రీనివాస్, డీఏవో గోవిందు తదితరులు పాల్గొన్నారు.