
ఉపాధ్యాయుల సర్దుబాటు
నిజామాబాద్‌అర్బన్: జిల్లా విద్యాశాఖలో నేటి నుంచి మరోసారి సర్దుబాటు ప్రక్రియ నిర్వహించనున్నారు. గతంలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు, ఇటీవల చేపట్టిన పదోన్నతులతో కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో సర్దుబాటు ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.
182 మందికి పదోన్నతులు..
వారం రోజుల క్రితం విభాగాల వారీగా మొత్తం 182 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయి. వీరిని సీనియారిటీ ప్రకారం పాఠశాలలకు కేటాయించారు. ఐతే, అంతకుముందే జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 252 మంది టీచర్లను సర్దుబాటు చేశారు. రెండు ప్రక్రియలతో కేటాయింపుల్లో గందరగోళం ఏర్పడింది. పదోన్నతి పొందిన వారు, సర్దుబాటులోని ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలకు కేటాయించబడ్డారు. దీంతో సర్దుబాటులో భాగంగా వెళ్లిన టీచర్లను విద్యాశాఖ మళ్లీ వెనక్కి పిలిపించి ఇతర ప్రాంతాలకు సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. పదోన్నతి పొందిన వారు వారికి కేటాయించిన పాఠశాలల్లోనే ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. కాగా, 46 మంది టీచర్లు పదోన్నతులను తిరస్కరించారు. దీంతో వీరిని పక్కనపెట్టి 136 టీచర్లకు సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నారు.
ఐతే, పదోన్నతులు తిరస్కరించిన టీచర్ల స్థానంలో అంతకుముందే సర్దుబాటులో వెళ్లిన టీచర్లు విధులు నిర్వర్తించనున్నారు. కాగా, మరోసారి సర్దుబాటు ప్రక్రియ నిర్వహించేందుకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఎంఈవోలతో కమిటీని ఏర్పాటు చేశారు. వీరు నేటి నుంచి సర్దుబాటు ప్రక్రియ చేపట్టనున్నారు.
అవసరమైన పాఠశాలలకు..
పదోన్నతి పొందిన టీచర్లకు పాఠశాలలు కేటాయించాం. అప్పటికే సర్దుబాటు ద్వారా అక్కడ ఉన్న టీచర్లను వెనక్కి పిలిపించి మళ్లీ అవసరమైన పాఠశాలలకు కేటాయిస్తాం. పదోన్నతి వదులుకున్న టీచర్లను వారి సర్వీస్ బుక్కుల్లో నాట్ విల్లింగ్ నమోదు చేస్తాం.
– అశోక్, డీఈవో
పదోన్నతులతో కేటాయింపుల
గందరగోళం
ప్రమోషన్లు తిరస్కరించిన
46 మంది టీచర్లు
136 మందికి మరోసారి కేటాయింపులు
నేటి నుంచి ముగ్గురు
ఎంఈవోలతో పరిశీలన

ఉపాధ్యాయుల సర్దుబాటు