
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు
నిజామాబాద్ అర్బన్: ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవిస్తుందని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఇంకా అర్హులు మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ అంకిత్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ.. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 11,852 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, మరో 84,232 మంది పేర్లను కొత్తగా లబ్ధిదారుల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని నార్త్, సౌత్ మండలాల పరిధిలో 3,174 కుటుంబాలకు కొత్త కార్డులు ఇవ్వడంతోపాటు 16,687 మంది సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో అవలంబించిన అసంబద్ధ పాలనా విధానాల కారణంగా రూ.7.80 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోనే ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సన్న బియ్యం పంపిణీ బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు దేశంలో మరెక్కడా లేదని, కేవలం తెలంగాణలోనే అమలవుతోందని అన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని షబ్బీర్ అలీ హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. రేషన్‌కార్డుల పంపిణీ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. అర్హులకు మాత్రమే కార్డులు మంజూరయ్యేలా పకడ్బందీగా పరిశీలన చేపడుతున్నామన్నారు. ఇంకా దరఖాస్తుల వెరిఫికేషన్ కొనసాగుతోందని, అర్హత కలిగిన కుటుంబాలకు కార్డులు మంజూరు చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎస్‌వో అరవింద్ రెడ్డి, సౌత్, నార్త్ తహసీల్దార్లు బాలరాజు, విజయ్‌కాంత్, ఆయా శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుంది
కార్డులు రాని వారు ఆందోళన చెందొద్దు
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి..
కొత్త కార్డుల మంజూరు
నిరంతర ప్రక్రియ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు
కార్డుల పంపిణీ