
ఎస్సారెస్పీలోకి 68,516 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్‌లోకి 68,516 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఆదివారం ఉదయం నుంచి క్రమక్రమంగా వరద పెరుగుతూ రాత్రి 7 గంటల వరకు 53 వేల క్యూసెక్కులకు చేరింది. నిలకడగా అంతే స్థాయిలో సోమవారం ఉదయం 3 గంటల వరకు వరద కొనసాగింది. అనంతరం వరద నీరు 68,516 క్యూసెక్కులకు పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలకడగా అంతేస్థాయిలో వరద వచ్చింది. సాయంత్రం 4 తర్వాత 65,740 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం వేగంగా పెరిగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 1074.60 (30 టీఎంసీలు) అడుగులకు పెరిగినట్లు పేర్కొన్నారు.
ఆయకట్టు రైతులు ఆందోళన చెందొద్దు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందొద్దని ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి అన్నారు. సోమవారం ప్రాజెక్ట్ నీటిమట్టాన్ని పరిశీలించారు. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి మరో రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వస్తున్న వరదతో ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 35 టీఎంసీలకు చేరుకుంటుందన్నారు. ఖరీఫ్‌లో పంటలకు కాలువల ద్వారా నీటి విడుదల చేపట్టాలంటే 50 టీఎంసీలకు ప్రాజెక్ట్ నీటి నిల్వ చేరాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు మరింత వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
నిజాంసాగర్‌లోకి 1,172 క్యూసెక్కులు..
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 1,172 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో తగ్గిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,391.22 అడుగుల (4.58 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.

ఎస్సారెస్పీలోకి 68,516 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో