
అడుగుకో గుంత..తీరేనా చింత?
నిజామాబాద్ రూరల్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు మొత్తం గుంతలమయం కావడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది. ద్విచక్రవాహనదారులు ఏ గుంతలో పడతామేమోనని భయపడుతున్నారు. రైలు వచ్చినప్పుడైతే ప్రయాణికులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని నానా అవస్థలు పడుతున్నారు. వర్షానికి శుక్రవారం సాయంత్రం 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్వోబీ పనులు ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి.
రాత్రి వేళ చిమ్మ చీకట్లు..
ఆర్వోబీ నిర్మాణం వద్ద లైటింగ్ లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఎక్కడ గుంత ఉందో తెలియక ప్రమాదాల బారిన పడిన ఘటనలున్నాయి. అదేవిధంగా బైపాస్ గుండా వెళ్లే వాహనాలు సైతం ఆర్వోబీ కింద నుంచి వెళ్లడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షం కారణంగా ప్రస్తుతం ఆర్వోబీ పనులు నిలిచిపోయాయి. కేవలం మొరం పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. ఆర్వోబీ పూర్తి కావడానికి ఇంకా రెండేళ్లు పడుతుందని ప్రాజెక్టు ఇంజినీర్లు చెబుతున్నారు. దాదాపు రూ.93.12 కోట్ల వ్యయంతో ఆర్వోబీ చేపడుతున్నారు. నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ప్రయాణికుల ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి.
భారీ వర్షంతో గుంత లుగా మారిన మాధవనగర్ ఆర్వోబీ రోడ్డు
రాత్రివేళ ప్రమాదకరంగా ప్రయాణం
గుంతలు పూడ్చాలని కోరుతున్న
వాహనదారులు
నత్తనడకన సాగుతున్న ఆర్వోబీ పనులు
ఎప్పుడు పూర్తవుతుందో తెలియని స్థితి?
ప్రమాదాలకు గురవుతున్నారు
చిన్నపాటి వర్షానికే ఆర్వోబీ వద్ద ఉన్న రోడ్డు చిత్తడిగా మారుతోంది. రోడ్డంతా గుంతలు పడ్డాయి. రాత్రివేళ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ముందుగా అధికారులు రోడ్డును పునరుద్ధరించి వాహనదారులు ప్రమాదాల బారినపడకుండా చర్యలు తీసుకోవాలి.
– సోమయ్య, ప్రయాణికుడు
ఇబ్బందులు కలుగకుండా చూడాలి
మాధవనగర్ ఆర్వోబీ పనులు ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు గడిచాయి. ప్రయాణికులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. అధికారులు వెంటనే స్పందించి వర్షాకాలం ప్రారంభం కాక ముందే రోడ్డు మరమ్మతులు చేయించాలని అధికారులను కోరుతున్నాం.
– హరి, మాధవనగర్‌వాసి

అడుగుకో గుంత..తీరేనా చింత?