
సజ్జ రైతుకు గుండెకోత
ఆర్మూర్: అకాల వర్షం సజ్జ పండించిన రైతులకు గుండె కోతను మిగిల్చింది. పంట మార్పిడి చేస్తూ వేసవిలో ఆరుతడి పండించి లాభపడాలనే సంకల్పంతో ముందుకు వెళ్లిన రైతన్న వంద రోజుల కష్టం నీరుగారి పోయింది. జిల్లాలో ప్రధానంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో పసుపు పంట తవ్వకాల అనంతరం అదే వ్యవసాయ క్షేత్రంలో విత్తన వ్యా పారస్తుల నుంచి ఫౌండేషన్ సీడ్ తీసుకొని రైతులు సజ్జ విత్తుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల ఎకరాల్లో జనవరి మూడో వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో సజ్జ విత్తనాలు వేశారు. వంద రోజుల్లో కోతకు వచ్చే ఈ పంటకు విత్తన వ్యాపారితో బై బ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. దీంతో వ్యాపారి పంట దిగుబడి నాణ్యత మేరకు క్వింటాలుకు రూ.6,300 నుంచి రూ.6,800 వరకు ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేస్తాడు. కానీ మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో కోతకు ముందే సజ్జ కంకులకు మొలకలు వస్తున్నాయి. మరోవైపు ముందస్తుగా పంటను కోసి ఎండబెట్టిన సజ్జ వర్షానికి తడిసి ముద్దవడంతో మొలకలు వచ్చాయి. దీంతో రైతుల ఆవేదన వర్ణణాతీతం. బై బ్యాక్ ఒప్పందం ఉన్నప్పటికీ మొలకలు వచ్చిన సజ్జలను కొనుగోలు చేసేందుకు విత్తన వ్యాపారస్తులు ఆసక్తి చూపించరు. దీంతో అటు రైతులు, ఇటు విత్తన వ్యాపారులు ఈ ఏడాది నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలు చేసిన సజ్జలను వ్యాపారస్తులు విత్తనశుద్ధి చేసి తమ కంపెనీ లేబుల్స్‌తో ప్యాక్ చేసి ఉత్తర భారతదేశంలో విక్రయిస్తుంటారు. ఈ సజ్జలను మక్కల తరహాలో పశువులు, కోళ్ల దాణాతోపాటు బేకరీల్లో పలు తిను బండారాల తయారీకి ఉపయోగిస్తారు. సజ్జ పంటను సాగు చేసిన తాము అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి..
మొలకెత్తిన సజ్జలు
ఆగం చేసిన అకాల వర్షం
కోతకు ముందే కంకులకు మొలకలు
ఎండబెట్టిన సజ్జలకు సైతం..
రైతులతోపాటు విత్తన వ్యాపారుల
ఆందోళన

సజ్జ రైతుకు గుండెకోత