
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్ సప్లిమెంటరీ ఇంగ్లిష్ ఫస్టియర్ పరీక్షలు శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఉదయం నిర్వహించిన పరీక్షలకు 1,867 మంది హాజరు కాగా 245 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,431మంది హాజరు కాగా 100 మంది గైర్హాజరయ్యారు. డీఐఈవో జిల్లా కేంద్రంలోని నాలుగు పరీక్ష కేంద్రాలను, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మి ఏడు పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఆరు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 12 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు.
‘సాగర్’లోకి ఇన్‌ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శుక్రవారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,076 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా చేరుతుందని ప్రాజెక్టు అధికా రులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు స్థానికంగా కురిసిన వర్షాల కారణంగా వాగుల ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లోగా వస్తోందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం1393.04 అడుగులు (5.567 టీఎంసీల) నీరు నిల్వ ఉందన్నారు.