
నకిలీ విత్తనాలకు చెక్
డొంకేశ్వర్ (ఆర్మూర్): ఖరీఫ్ సీజన్‌కు రైతులు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలను అరికట్టే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా స్థాయిలో సీడ్స్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు నలుగురు ఉన్నతాధికారులను నియమిస్తూ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బృందంలో బోధన్ ఏడీఏ ఎంఏ అలీ అహ్మద్, పోలీసు శాఖ నుంచి ఏడీసీపీలు రాంచందర్ రావు, బస్వారెడ్డి, సీడ్స్ సర్టిఫికేషన్ అధికారి నగేశ్ ఉన్నారు. వీరు మండల స్థాయి అధికారులను సమన్వయం చేసుకొని విత్తన డీలర్లు, పంపిణీదార్లు, గోదాములు, దుకాణాలను తనిఖీ చేస్తారు. ఖరీఫ్‌కు అవసరమైన వరి, సోయా, మక్క, పత్తి విత్తనాలపై దృష్టి పెట్టనున్నారు. వ్యాపారులు ఇప్పటికే విత్తనాలను జిల్లాకు తెప్పించి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం గుర్తించిన విత్తనాలు కాకుండా నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్నట్లు తనిఖీల్లో తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5,21,303 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇందులో అత్యధికంగా 4.32 లక్షల ఎకరాల్లో వరి, 47 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 37 వేల ఎకరాల్లో సోయా సాగయ్యే అవకాశం ఉన్నట్లు ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం వేసవి దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు వర్షాల రాకతో పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
కట్టడికి జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్
బృందం ఏర్పాటు
నిరంతరం తనిఖీలు చేపట్టనున్న
అధికారులు
లైసెన్సు ఉన్న డీలర్ల వద్దే కొనాలి
నకిలీ విత్తనాలు అరికట్టి రైతులు మేలైన విత్తనాలు పొందేలా జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటైంది. రైతులు విత్తనాలు కొనే ముందు లైసెన్సు కలిగిన ఆధీకృత డీలర్లు అవునో కాదో చూడాలి. లూజు విత్తనాలు అసలే కొనకుండా ప్రభుత్వం గుర్తించి ఆమోదం తెలిపిన విత్తనాలను కొనుగోలు చేయాలి. రసీదు తప్పనిసరిగా పొందాలి. కొనుగోలు చేసిన ప్యాకెట్లు, బస్తాలను రైతులు భద్రంగా దాచి పెటుకోవాలి.
– వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి