కోర్టులో ఉద్యోగం పేరిట నకిలీ అపాయింట్‌మెంట్
ఖలీల్‌వాడి: కోర్టులో ఉద్యోగం కల్పిస్తామని మాయమాటలు చెప్పి రూ. 9 లక్షలు తీసుకొని నకిలీ అపాయింట్‌మెంట్ ఇచ్చిన వ్యక్తిపై నిజామాబాద్ రూరల్ మండలం మల్లారం గ్రామ పరిధిలోని లింగి తండాకు చెందిన తేజావత్ పీరు సోమవారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సిరికొండ మండలంలోని చీమన్‌పల్లి గ్రామానికి చెందిన మాలవత్ మోహన్ ఓ శుభకార్యంలో కలిసి పోస్టాఫీసు, కోర్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని, చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు. డబ్బులు చెల్లిస్తే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికినట్లు చెప్పారు. దీంతో పీరు తమ తల్లిదండ్రులు వద్ద నుంచి రూ.4 లక్షలు డబ్బులు తీసుకొని పోస్టాఫీసులో ఉద్యోగం ఇప్పించాలని కోరడంతో కొన్ని రోజుల తర్వాత నకిలీ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. విషయం తెలిసి మోహన్‌ను నిలదీయగా ఎవరికీ చెప్పొద్దని, కోర్టులో మార్చి నెలలో ఉద్యోగం ఇప్పిస్తానని మిగితా డబ్బులు చెల్లించాలని చెప్పడంతో అప్పు చేసి మరో రూ. 5 లక్షల వరకు చెల్లించినట్లు పేర్కొంది. మాలవత్ మోహన్‌తోపాటు అతని భార్య లావణ్య, కుతూరు శ్రావణి, కుమారుడు శ్రావణ్‌తోపాటు మాలవత్ రాజుకు విడతల వారీగా రూ.9 లక్షలు చెల్లించినట్లు చెప్పారు. కోర్టు ఉద్యోగం వచ్చిందని మాలవత్ రాజు జిల్లా కోర్టులోని రెండో ఫ్లోర్‌లోకి వెళ్లి అక్కడ నిలుచోబెట్టి ఒక రిజిస్ట్రార్ తీసుకువచ్చి సంతకం చేయించుకున్నట్లు చెప్పింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దనడంతో అనుమానం వచ్చి అపాయిమెంట్ ఆర్డర్ చూపించడంతో నకిలీదిగా తేలిందన్నారు. ఇదే విషయాన్ని మోహన్‌ను అడిగితే దుర్భషలాడుతున్నట్లు చెప్పారు. నకిలీ అపాయిమెంట్ ఇచ్చిన మోహన్‌తోపాటు వారి కుటుంబసభ్యులపై చర్యలు తీసుకువాలని సీపీని కోరినట్లు బాధితురాలు తెలిపారు.
సీపీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు


