
ధర్మమార్గంలో నడవాలి
డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రజలంతా ధర్మమార్గంలో నడవాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధానంగా యువత సన్మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. సోమవారం డొంకేశ్వర్ మండలం నికాల్‌పూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రతిష్టాపన ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తనది నిర్మల్ జిల్లా అయినప్పటికీ డొంకేశ్వర్ మండల చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు ఉన్నారని, నికాల్‌పూర్‌లో కూడా ఉన్నట్లు తెలిపారు. అనంతరం జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన కమిటీ, వీడీసీ సభ్యులు, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. చివరి రోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, అభిషేకం, కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డి, రావుల సుభాష్, భీమ్‌నాయక్, సుమన్ పాల్గొన్నారు.