డెంగీ నివారణకు కృషి చేయాలి
నిజామాబాద్‌నాగారం: డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే వ్యాధి నియంత్రణ జరుగుతుందని జిల్లా మలేరియా అధికారి, నిజామాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్ అన్నారు. నగరంలోని సీతారాంనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా వైద్య సిబ్బంది పరిసరాలను శుభ్రంగా ఉంచాలి.. నీటి నిల్వలను తొలగించాలి.. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తుకారం మాట్లాడుతూ.. ప్రతి శుక్రవారం డ్రైడేని విధిగా పాటించాలన్నారు. దోమల నివారణ, కీటక జనిత వ్యాధుల నివారణ కోసం వైద్యశాఖనే కాకుండా ప్రజలందరూ భాగస్వాములైనప్పుడే నివారించవచ్చు అన్నారు. వైద్యసిబ్బంది నవ్య, సహిస్తాహిర్దోష్, సలీం, ఘన్పూర్ వెంకటేశ్వర్లు, గోవర్ధన్, నటరాజ్, రవిచందర్, సుశీల, శ్యామల, మధుసూదన్, స్వామి, శశిరేఖ, సుశీల, కవిత, సంగీత పాల్గొన్నారు.


