
తల్లి చేపా.. లేదు చిల్లి గవ్వ
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి అవసరమయ్యే తల్లి చేపల సేకరణ నిధుల్లేక ఆగిపోయింది. సీజన్ ముగింపునకు వస్తున్నా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతోనే తల్లి చేపల సేకరణ ప్రక్రియ ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేంద్రానికి 5 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. జిల్లాలోని చెరువులు, ప్రాజెక్ట్‌లకు ఇక్కడి నుంచే చేపపిల్లలను సరఫరా చేయొచ్చు. కానీ, పాలకులకు టెండర్ ద్వారా దిగుమతి చేసుకునే చేపపిల్లలపై ఉన్న శ్రద్ధ ఇక్కడి ఉత్పత్తి కేంద్రంపై ఉండదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కమీషన్ల కోసమే అటు వైపు మొగ్గు చూపుతారనే ఆరోపణలున్నాయి.
మెయింటెనెన్స్‌కు నిధులు
చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మెయింటెనెన్స్ కో సం ప్రభుత్వం రూ.1.5 లక్షలు మంజూరు చేసింది. దీంతో పైపులైన్, సిమెంట్ కుండీల్లో మైనర్ మ రమ్మతులు చేపడుతున్నారు. మరిన్ని నిధులు మంజూరు చేస్తే నీటి కొరత లేకుండా సమస్యలను పరి ష్కరించుకోవచ్చుని అధికారులు చెబుతున్నారు.
మంజూరు కాని నిధులు
మొదలుకాని చేపల సేకరణ
ముగుస్తోన్న సీజన్
రెండు టన్నులు అవసరం
చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా మొదట చెరువుల నుంచి తల్లి చేపలను దిగుమతి చేసుకుంటారు. ఈ కేంద్రానికి 2 టన్నుల తల్లి చేపలు అవసరం ఉంటుంది. దీంతో కిలోకు రూ. 100 చొప్పున మత్స్యకారుల నుంచి రెండు టన్నుల తల్లి చేపలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకు రూ. 2 లక్షలు, రవాణా ఖర్చులు రూ.50 వేలు, తల్లి చేపల పోషణ(దాణా)కు రూ. 2 లక్షలు అవసరం ఉంటుంది. మే రెండో వారం నుంచే తల్లి చేపల సేకరణ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. దీంతో తల్లి చేపల కొనుగోలుపై మత్స్యశాఖ అధికారులు సందిగ్ధంలో పడ్డారు. గతేడాది సైతం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంతో చేప పిల్లల ఉత్పత్తి ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో పాతిక శాతం కూడా చేప పిల్లలను ఉత్పత్తి చేయలేదు.
ఉన్నతాధికారులకు నివేదించా..
తల్లి చేపల సేకరణ కోసం ఉన్నతాధికారులకు నివేదించాను. నిధులు మంజూరు చేయాలని కోరాం. వారం రోజుల్లో తల్లి చేపల సేకరణ చేపట్టాలి.
– దామోదర్, ఎఫ్‌డీవో, పోచంపాడ్