
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెంచాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను భారీగా పెంచడానికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. నగరంలోని కలెక్టరేట్‌లో గురువారం మధ్యాహ్నం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలు, బడుల్లో అడ్మిషన్లను పెంచడంతోపాటు, రానున్న సప్లమెంటరీ పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని హెచ్‌ఎం, ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. ఫలితాల సాధనలో 90 రోజుల ప్రణాళికలను అమలు చేశామని అలాగే ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షలకు 15 రోజుల ప్రణాళిక ద్వారా 100 శాతం ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ ఆర్టీసీ బస్ సౌకర్యం లేదని, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపినట్లయితే అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందన్నారు. ప్రభుత్వ అనుమతి లేని కళాశాలలో విద్యార్థులను చేర్పించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లావిద్యాశాఖ అధికారి అశోక్, ఆర్టీసీ అధికారులు, ఫైర్ ఆఫీసర్, ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్ సంబంధిత అధికారులు, జిల్లా ఇంటర్ విద్య పరీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దీన్ అస్లాం తదితరులు పాల్గొన్నారు.