
ఉబ్బసంతో ఉక్కిరిబిక్కిరి
జిల్లాలో ఆస్తమా బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆస్తమా వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. నాళాలకు వాపు రావడంతో జిగురుగా ఉండే పదార్థం(శ్లేష్మం) తయారవుతుంది. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. దుమ్ము, పుష్పాల దూళి, గాలి కాలుష్యం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు, చల్లటి, పొడి గాలులు ఆస్తమా బారిన పడేందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కొంతమందిలో ఆస్తమా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.
గుర్తించండి ఇలా..
సాధారణ పనులు, వ్యాయామం చేయడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఛాతి బిగపట్టినట్లు ఉంటుంది. విపరీతంగా దగ్గు వస్తుంది. నడిచినా, మెట్లెక్కినా త్వరగా అలసిపోతారు.
వ్యాధిగ్రస్తులకు జాగ్రత్తలు..
పొగ తాగడం మానేయాలి. ఇతరులు తాగితే దూ రంగా ఉండాలి. దుమ్ము, ధూళి, చల్లని ప్రదేశాల్లో సంచరించొద్దు. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. విటమిన్ ‘డి’ సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
ఏం తినాలి? ఏం తినొద్దు?
విటమిన్ ‘ఏ’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.ప్రధానంగా క్యారెట్లు, పాలకూర, చిలగడదుంప, చేప, పాల ఉత్పత్తులు, గుడ్లు తినాలి.
మాంసం, చీజ్, ఐస్‌క్రీమ్, పాలకొవ్వు వంటి సంతృప్త ఆమ్లాలను నివారించాలి. వీటితో వాపు పెరిగి ఇబ్బందులు కలుగుతాయి. కొబ్బరి నూనె, పామ్‌ఆయిల్‌తో చేసిన ఆహారంతో ఆస్తమా పెరిగే అవకాశం ఉంటుంది.
వాతావరణంలోని అలర్జీ కలిగించే పదార్థాల కారణంగానో.. వంశపారంపర్యంగానో వచ్చే ఉబ్బసం(ఆస్తమా) వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టతరమవుతోంది. దీంతో రోజూవారీ జీవితం ప్రభావితమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం లేనప్పటికీ.. సమర్థవంతమైన చికిత్స, మందుల వాడకంతో సంతృప్తికరంగా జీవించొచ్చని ప్రముఖ పల్మనాలజిస్టు రాజేంద్రప్రసాద్ తెలిపారు. నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – నిజామాబాద్ నాగారం
జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం
నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం
భయపడొద్దు..
ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి. భయపడాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహాలు, సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తే వ్యాధిని తరిమికొట్టవచ్చు. వైద్యులు సూచించిన మందులతోపాటు ఇన్హెలర్ వాడాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి, చల్లని ప్రదేశాల్లో తిరుగొద్దు.
– డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్, ప్రముఖ పల్మనాలజిస్ట్

ఉబ్బసంతో ఉక్కిరిబిక్కిరి