
‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
తెయూ(డిచ్‌పల్లి): డిగ్రీ ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం ‘దోస్త్’ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) 2025–26 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలకు అవకాశం కల్పించింది. ఈ సారి దోస్త్ ప్రక్రియను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించాలని మొదట ఉన్నత విద్యామండలి అధికారులు భావించారు.
అయితే చివరకు ఆలస్యంగా శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. గతేడాది మాదిరిగానే ఈ సారి విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకునేందుకు వీలు కల్పించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతేడాది సున్నా అడ్మిషన్లు జరిగిన 82 కళాశాలలకు ఈ సారి అనుబంధ గుర్తింపు ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించారు. కొత్త కోర్సులు ప్రారంభించాలనుకునే కాలేజీల సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
డిగ్రీలో విద్యాప్రమాణాల పెంపు, సిలబస్ మార్పుపై నాలుగు నెలలుగా మండలి తీవ్రంగా కృషి చేస్తోంది. వర్సిటీల వీసీలు, విద్యారంగ నిపుణులతో సిలబస్ మార్పుపై మండలి చైర్మన్ చర్చలు జరిపారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ అమలులోకి తెస్తామని తెలిపారు. అయితే దీనికి విద్యాశాఖ ఇంతవరకూ ఆమోదం తెలుపకపోవడంతో సిలబస్ మార్పుపై సందేహాలు నెలకొన్నాయి.
రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్‌టీయూ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి(టీఎస్‌బీటీఈటీ) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ సింగిల్ విండో ద్వారా సేవలను అందిస్తోంది. విద్యార్థులు ఎవరి సహాయం లేకుండా స్వయంగా తమ డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్‌లో పేర్కొంది. దోస్త్ వెబ్‌సైట్ https:// dost. cgg. gov. in ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
తెయూ పరిధిలో 69 కళాశాలలు
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ (ప్రభుత్వ 15, ప్రభుత్వ అటానమస్ 5, ప్రైవేటు 49) కళాశాలలు మొత్తం 69 ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 33,830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే గతేడాది కేవలం 12,764 సీట్లు(37.73 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ సారి కూడా 40 శాతం లోపే సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు
తెయూ పరిధిలో 33,830 సీట్లు
మొదటి విడత: మే 3 నుంచి 21వరకు మొదటి విడతగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 10నుంచి 22వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.
రెండవ విడత: మే 30 నుంచి జూన్ 8వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 30 నుంచి జూన్ 9వరకు వె బ్ ఆప్షన్లు. జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది.
మూడవ విడత: జూన్ 13 నుంచి 19వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 13 నుంచి 19వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం.