నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. గోడౌన్‌కు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తు తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, విజయేందర్ తదితరులు ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సిరికొండ: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గడ్డం రాజేశ్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపులో 40 సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 5 నుంచి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందని అన్నారు.
యూడీఐడీ పోర్టల్‌లో సదరం సేవలు
డొంకేశ్వర్/ నిజామాబాద్ అర్బన్: దివ్యాంగులు సదరం కోసం యూడీఐడీ పోర్టల్‌లోనే స్లాట్ బుక్ చేసుకోవాలని డీఆర్డీవో సాయాగౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందించే సర్వీసులపై కొత్తగా రూపొందించిన యూడీఐడీ పోర్టల్‌పై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భగా డీఆర్డీవో మాట్లాడుతూ.. యూడీఐడీలో 21 రకాల కేటగిరీలు ఉన్నాయని, ఇక మీదట సదరం కోసం యూడీఐడీలోనే స్లాట్ నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందుకు దివ్యాంగులు తమ ఆధార్ కార్డును మీసేవ కేంద్రాలకు తప్పనిసరిగా తీసుకెళ్లాలని కోరారు. సొంతగా మొబైల్ ఫోన్‌లో కూడా చేసుకోవచ్చన్నారు. ఇదివరకు సదరం సర్టిఫికెట్ కలిగి కాలపరిమితి ముగిసిన వారు యూడీఐడీలోనే రెన్యూవల్ చేసుకోవాలన్నారు. మీ–సేవ నిర్వాహకులకు ఈ నెల 5న దీనిపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. డీపీఎం రాచయ్య, ఏపీఎం ఉమా కిరణ్, సీడీపీవో సౌందర్య, ట్రైనర్ స్రవంతి, దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని సిర్‌పూర్ శివారులో ఉన్న మంజీర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం పట్టుకున్నట్లు ఆర్‌ఐ సాయిబాబా తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో కలిసి ట్రాక్టర్‌ను మద్నూర్ పీఎస్‌కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈవీఎం గోడౌన్ పరిశీలన