
తెయూ ఆర్ట్స్ డీన్‌గా త్రివేణి
తెయూ(డిచ్‌పల్లి): తెయూ ఆర్ట్స్ డీన్ (కళల పీఠాధిపతి)గా తెలుగు అధ్యయన శాఖ ప్రొఫెసర్ వంగరి త్రివేణి నియామకమయ్యారు. తెయూ ఇన్‌చార్జి వీసీ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ యాదగిరి త్రివేణికి నియామక ఉత్తర్వులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన పరిశోధనలు కొనసాగేలా, ప్రామాణికమైన సిద్ధాంత గ్రంథాలు వెలువడే విధంగా కృషి చేస్తానని తెలిపారు. పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ప్రశాంతంగా పీజీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెయూ పరిధిలో పీజీ బ్యాక్‌లాగ్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగినట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. ఉదయం నిర్వహించిన పీజీ 1వ, 3వ సెమిస్టర్ పరీక్షల్లో 302 మందికి 231 మంది హాజరు కాగా 71 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కంట్రోలర్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పీజీ 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు నలుగురు విద్యార్థులకు గాను ముగ్గురు హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
పీడీఎస్‌యూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
తెయూ(డిచ్‌పల్లి): తెయూ పీజీ కోర్సుల్లో నూతన ప్రవేశం పొందిన విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు తెయూ పీడీఎస్‌యూ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. క్యాంపస్ ప్రధాన కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు అధ్యక్ష, కార్యదర్శులు వి.సంతోష్, జయంతి తెలిపారు. పీజీ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఏవైనా సందేహాలుంటే తమను సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9912252495, 7780605546 నంబర్లను సంప్రదించాలన్నారు.
చెవిలో పూలతో సిబ్బంది నిరసన
తెయూ(డిచ్‌పల్లి): తెయూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన కార్యక్రమాలు మంగళవారం 13వ రోజుకు చేరాయి. క్యాంపస్‌లోని అంబేద్కర్ ప్రధాన కూడలి వద్ద ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తమ చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఔట్‌సోర్సింగ్ యూనియన్ అధ్యక్షుడు బట్టు సురేశ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి బికోజీ, రామకృష్ణ, నరేశ్, సతీశ్, సుధీర్, ప్రేమ్‌కుమార్, తిరుపతి, గంగాధర్, నవ్య, మౌనిక, మంజుల, సవిత, సీత, సునీత, గులాబ్, సాయి, విజయ, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెయూ సమాచారం..


ఉత్తర్వులు అందజేస్తున్న రిజిస్ట్రార్ యాదగిరి