
నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం
నిజామాబాద్‌నాగారం: నగర మున్సిపల్(నుడా)లో ఉద్యోగుల విషయంలో అధికార ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉండే అధికారులకే అందలం దక్కుతుంది. నచ్చితే ఏళ్ల తరబడిగా వారిని కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో రిటైర్డు అయినా ఉద్యోగులు ఆయా శాఖల్లో పెత్తనం చలాయిస్తూ, వారి కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. అయినా శాఖ ఉన్నతాధికారులెవరూ పట్టించుకోవడం లేదు.
ఆ ముగ్గురు..
నిజామాబాద్ మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్‌లో రిటైర్డు అయినా ఉద్యోగి ఇక్కడే ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా పదోన్నతులు పొంది చివరకు నాలుగేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. అనంతరం ఆ అధికారికి ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో నాలుగేళ్లుగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కొనసాగుతున్నారు. ఈయన స్థానంలో పని చేసేందుకు కొత్త ఉద్యోగులను నియమించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అధికారి కనుసన్నల్లోనే ఇంజనీరింగ్ వ్యవస్థ నడుస్తోంది. అలాగే ఎస్టాబిషన్ విభాగంలో మరో అధికారి ఇదే రీతిన కొనసాగుతున్నారు.కాగా ఓ రిటైర్డు అధికారిపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో, సదరు అధికారికి ప్రజాప్రతినిధి అండదండలు లేకపోవడంతో మూడు రోజుల క్రితం పొడగింపు రద్దు చేసి ఇంటికి సాగనంపారు.
నేడు కౌన్సిల్ సమావేశం..
నగరంలోని నూతన మున్సిపల్ భవనంలో మొదటి కౌన్సిల్ సమావేశం బుధవారం జరుగనుంది. మేయర్ నీతూకిరణ్ అధ్యక్షతన, కమిషనర్ మంద మకరందు పర్యవేక్షణలో ఉదయం 11.00గంటలకు జరగనుంది. అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు బిగాలగణేష్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్థన్‌లు, కలెక్టర్ రాజీవ్‌గాంధి హనుమంతు హాజరుకానున్నారు. నగరంలోని 60 డివిజన్‌లకుసంబంధించి కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ వర్క్‌లకు, రెవెన్యూ టెండర్లు, జిల్లా పంచాయతీ నుంచి వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాల పెంపు, సానిటేషన్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కొనసాగింపు తదితర వాటిపై చర్చ జరుగనుంది. అలాగే నగరంలో 60 డివిజన్లలో జరుగుతున్న పనులపై చర్చించనున్నారు. దీంతో పాటు మినీట్యాండ్‌పై కొత్తగా టెండరు వేసి 5 దుకాణాలు, పార్కింగ్‌పై చర్చ ఉంటుంది.
నుడాలో వివిధ శాఖల్లో నాలుగేళ్లుగా
కొనసాగుతున్న పలువురు
పట్టించుకోని ఉన్నతాధికారులు