
సభాప్రాంగణానికి నడిచివస్తున్న ప్రజలు
నిజామాబాద్ అర్బన్: నగరంలో జీజీ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇందూరు జనగర్జన సభకు జనం పోటెత్తారు. సభకు ఉదయం నుంచి ప్రజల సందడి మొదలైంది. బీజేపీ నాయకుల అంచనా మేరకు ప్రజలు తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సభాప్రాంగణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. దీంతో కంఠేశ్వర్, బైపాస్ ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ప్రధాన గేట్ల ద్వారా ప్రజలను తనిఖీ చేసి సభలోకి అనుమతించారు. సభా ప్రాంగణం నిండిపోవడంతో కొంత మందిని అనుమతించలేదు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
జనంమెచ్చిన నాయకుడి కోసం..
ఖలీల్‌వాడి: తమ ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోదీ ఇందూరులో నిర్వహించిన జనగర్జన సభను వీక్షించేందుకు జిల్లా నుంచే కాకుండా ఉత్తర తెలంగాణ పసుపు రైతులు సైతం అధిక సంఖ్యలో హాజరయ్యారు. నగరంలోని జీజీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సభా ప్రాంగణం నిండిపోవడంతో రోడ్డుపైనే కూర్చొని మోదీ సభను వీక్షించారు. బీజేపీ నాయకుల అంచనా కంటే జనం అధిక సంఖ్యలో హాజరు కావడంతో సభా ప్రాంగణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు జనంతో నిండిపోయాయి. ఉత్తర తెలంగాణలోని జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన పసుపు రైతులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈనెల 1న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీజేపీ సభలో మోదీ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రైతులు ఇందూరు జనగర్జన సభకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కంఠేశ్వర్ బైపాస్ నుంచి జీజీ కళాశాల వరకు ప్రజలతో నిండిపోయింది. కొంత మంది యువకులు, రైతులు మోదీని చూసేందుకు భారీ కటౌట్లు, చెట్లు ఎక్కారు. సభా ప్రాంగణం బయటే సుమారు 40 వేల మంది ఉన్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.
భారీగా తరలివచ్చినపసుపు రైతులు
కిక్కిరిసిన సభా ప్రాంగణం
రోడ్డుపై నుంచే వీక్షించిన ప్రజలు

సభకు వచ్చిన తల్లితో చిన్నారి

గిరిరాజ్ కాలేజీ మైదానానికి తరలివస్తున్న ప్రజలు, బీజేపీ శ్రేణులు


