
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి
మోర్తాడ్(బాల్కొండ): పసుపు బోర్డు కేవలం ఎన్నికల జిమ్మిక్కు అని, స్పైసిస్ బోర్డులో భాగంగా ఉన్న పసుపునకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలంటే చట్ట సవరణ చేయాల్సి ఉందని ఈ విషయం ప్రధాని నరేంద్ర మోదీకి తెలియదా అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. 1986లో పార్లమెంట్ ద్వారా చట్టమైన స్పైసిస్ బోర్డులో పసుపు ఒక భాగం అని గుర్తు చేశారు. ప్రత్యేక చట్టం ద్వారానే పసుపు బోర్డు సాధ్యమవుతుందని వెల్లడించారు. ఏర్గట్ల మండలంలోని తొర్తి, తాళ్లరాంపూర్, గుమ్మిర్యాల్, బట్టాపూర్‌లో రూ.21 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులపై చిత్త శుద్ధి ఉంటే పార్లమెంట్‌లో ఎందుకు బిల్లు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రధాని కొత్త ఎత్తుగడ వేశారని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కొటపాటి నర్సింహ నాయుడు, రాజారాం యాదవ్, ఎంపీపీ కొలిప్యాక ఉపేంద్ర, జడ్పీటీసీ సభ్యుడు గుల్లె రాజేశ్వర్, సర్పంచులు కుండ నవీన్, భానుప్రసాద్, పద్మ, పార్టీ మండల అధ్యక్షుడు రాజాపూర్ణనందం తదితరులు పాల్గొన్నారు.
చట్ట సవరణ చేయకుండానే
పసుపు బోర్డా..
మంత్రి ప్రశాంత్‌రెడ్డి