
మాట్లాడుతున్న దుద్దిల్ల శ్రీధర్‌బాబు
ఖలీల్‌వాడి: తెలంగాణలో బంగారు తల్లి పథకం తీసుకొచ్చేందుకు మ్యానిఫెస్టో కమిటీ చర్చలు జరుపుతుందని టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్‌బాబు అన్నారు. నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నేతల నుంచి మ్యానిఫెస్టో కమిటీ ఇచ్చిన వినతులను స్వీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బంగారుతల్లి పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని విషయాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీ పథకాలపై నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ పథకాలను ప్రకటించిన తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీల్లో గుబులు పుట్టుకున్నట్లు చెప్పారు. అందుకే కర్ణాటకలో ఈ పథకాలు అమలు చేయలేదని లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రూ.5 లక్షల కోట్లు తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసిందని, వీటిని కాంట్రాక్టర్ల పేరిట దోపిడీ చేశారని ఆరోపించారు. ఉద్యోగులకు నెలసారి వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శించారు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ అనిల్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్‌హంనదాన్, రూరల్ ఇన్‌చార్జి భూపతిరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌రెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, వివిధ విభాగాల జిల్లా, నగర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు